east godavari, iyenavelly siddhi vinayaka swami temple, apurupa, teluguh blog,
సప్తనదీ సంగమప్రాంతం... గోదావరీతీరం.. పచ్చని కొబ్బరిచెట్లు, వరి పొలాలు సోయగాల మధ్య అలరారే కోనసీమ, పచ్చటి పొలాలకే కాదు పుణ్యక్షేత్రాలకూ ఆలవాలం. కోనసీమలోని పుణ్యక్షేత్రాల్లో భక్తులకు కొంగు బంగారంగా, కోరిన వరాలిచ్చే దేవుడిగా, పిలిచిన పలికే దైవంగా విఖ్యాతుడైన సిద్ధి వినాయకుడు అయినవిల్లిలో కొలువై ఉన్నాడు.
ఈ స్వామి స్వయంభువు. దక్షయజ్ఞం సమయంలో దక్షుడు ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసినట్టు చెబుతారు. అలాగే 12వ శతాబ్దంలో శ్రీపాద శ్రీవల్లభుడి తాతగారు బాపనయ్యకు స్వామి వారు స్వర్ణ గణపతిగా దర్శన మిచ్చినట్టు, స్వామి తొండంతో పూర్ణాహుతి స్వీకరించినట్టు మరో కథ వ్యాప్తిలో ఉంది. స్వామి వారికి నారి కేళ జలాభిషేకం ప్రీతి పాత్రం. స్వామి వారికి మొక్కుబడిగా కొబ్బరి కాయలు చెల్లిస్తారు. ఈ ఆలయం విశాలమైన ఆవరణ, ఎత్తెన ప్రాకారంతో విరాజిల్లుతోంది. స్వామి వారు దక్షిణాభిముఖుడై దర్శనమిస్తారు. శివకేశవ తారతమ్యాలు లేవని ఈ ఆలయం చాటి చెబుతుంది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, అన్నపూర్ణ విశ్వేశ్వరాలయం ఉన్నాయి. ఆలయ క్షేత్రపాలకుడిగా కాలభైరవ స్వామి కొలువై ఉన్నాడు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి తరలి వచ్చే భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంటుంది. సిద్ధి వినాయక స్వామి వారికి ప్రతిరోజూ విశేష పూజలు జరుగుతాయి.
ఆలయ ప్రత్యేకత
సువిశాల ఆవరణలో, ఎత్తైన ప్రాకారంతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో క్షేత్రస్వామి శ్రీ సిద్ధి విఘ్నేశ్వరస్వామి దక్షినాభిముఖుడై భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా ప్రతీ దేవాలయంలో విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే అయినవిల్లి సిద్ధి వినాయకుడు దక్షిణ ముఖంగా ఉండడం విశేషం. ఈ ఆలయ ప్రాంగణంలో క్షేత్ర పాలకుడైన కాల బైరవుడి ఆలయంతోపాటు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకేశవస్వామి ఆలయం, శివాలయం, శ్రీఅన్నపూర్ణాదేవి ఆలయాలు ఉన్నాయి. ఈ క్షేత్రం కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంకు 26 కిలోమీటర్లు, రాజమండ్రికి 60 కిలోమీటర్లు, కాకినాడకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వినాయక చవితికి ప్రత్యేక పూజలు
వినాయక చవితి సందర్భంగా ఇక్కడ నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి.
ప్రత్యేక పూజలు
స్వామివారి ఆలయంలో నిత్యం ప్రత్యేక పూజలు జరుగుతాయి.
- ఏకాదశ రుద్రాభిషేకం
- (పూజ సామగ్రి భక్తులు ఏర్పాటు చేసుకోవాలి) మహాన్యాసాభిషేకం
- లఘున్యాసాభిషేకం
- అష్టోత్తర పూజ
- పుస్తకాల పూజ .
- అన్నప్రాశన
- అక్షరాభ్యాసం
- వాహనపూజ
- శ్రీ లక్ష్మీగణపతి హోమం
- నవగ్రహ హోమం

శాశ్వత పూజా పథకం
ఈ పథకంలో రూ.300 చెల్లిస్తే సంవత్సరంలో వారు కోరిన ఒక రోజున లఘున్యాస అభిషేకం నిర్వహిస్తారు. అలాగే మహాన్యాసాభిషేకానికి రూ.500, ఏకాదశ రుద్రాభి షేకానికి రూ.2000 భక్తులు చెల్లించాలి. ఈ మొత్తాన్ని స్వయంగా అందజేయవచ్చు. లేదా పోస్టు ద్వారా గానీ, ఎగ్జి క్యూటివ్ ఆఫీసర్, శ్రీ విఘ్నేశ్వరస్వామి ఆలయం, ఎస్.బి. హెచ్., అయినవిల్లి, బ్రాంచి, కోడ్ నెం.2607, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ పేరున డీడీ తీసుకునిగానీ పంపించవచ్చు.
ఆలయానికి రావాలంటే...
- రాజమండ్రి నుంచి రావులపాలెం మీదుగా, బోడిపాలెం నుంచి వానపల్లి మీదుగా అయినవిల్లి చేరుకో వచ్చు. ఈ రూట్లో దూరం 60 కిలోమీటర్లు.
- కాకినాడ నుంచి యానాం మీదుగా అమలాపురం వచ్చి ముక్తేశ్వరం మీదుగా అయినవిల్లి చేరుకోవచ్చు. దూరం 65 కి.మీ.
- కాకినాడ మీదుగా ద్రాక్షారామం చేరుకుని కోటిపల్లి రేవు దాటి ముక్తేశ్వరం చేరవచ్చు. అక్కడనుంచి అయినవిల్లి రావచ్చు. దూరం 45 కి.మీ.
- కాకినాడ మీదుగా యానాం, అక్కడ నుంచి ముమ్మిడివరం మీదుగా ముక్తేశ్వరం చేరుకుని అయినవిల్లి రావచ్చు. దూరం 45 కి.మీ.
ఆలయం వద్ద అన్నదానం
స్వామి ఆలయం వద్ద నిత్యం అన్నదానం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నారు.
ఆలయం తీసి ఉండే సమయాలు
ఆలయం ఉదయం 6.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయం తెరిచి ఉంచుతారు.
ప్రముఖమైనది అయినవిల్లి సిద్ధివినాయక ఆలయం ప్రతీ శుభకార్యానికి ముందు అయినవిల్లి సిద్ధివినాయకుణ్ని పూజిస్తే ఆకార్యం నిర్విఘ్నంగా పూర్తవుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా ప్రసిద్ధికెక్కాడు
COMMENTS